Friday, June 1, 2007

జంట పదాల అల్లరి - చిల్లరి

ఎంతో కొంత మంచీ-చెట్టా వుండాలిగాని మరీ ఇంత అల్లరి-చిల్లరిగా ప్రవర్తించడం తగదు సుమా!

మొగుడూ పెళ్ళాల అనుబంధం ఈనాటిదా? తల్లితండ్రులు కాబోతుండగా ఈ రచ్చా-రభసా తగదు. దేనికయినా ఓ హద్దూ-పద్దూ వుండాలిగాని మరీ ఇంత గీర-గర్వం పనికిరాదు. కాస్తయినా బుద్ధీ-జ్ఞానం వుండక్కరలేదా? కాస్తో-కూస్తో, డబ్బూ-దస్కం, భూమి-పుట్రా, వున్నాయిగా. మరీ కక్కుర్తి పడిపోయి గడ్డీ-గాదం, చెత్తా-చెదారం, పోగెయ్యక్కరలేదు. ఏదైనా అనేముందు కాస్త ముందూ-వెనకా చూడొద్దా? కష్టం-సుఖః, పగలూ-రాత్రి లాంటివి కదా!

అయినా ప్రతీ వ్యవహారానికి రాతా-కోతా అని కూర్చుంటే కుదురుతుందా? గుట్టూ-మట్టూ ఉన్నంతవరకే అందం-చందం. పిచ్చాపాటిగా మొదలయి మాటా-మాటా పెరిగి చిట్టచివరికి మాటా-మంతీ లేకుండా బిర్ర బిగుసుకుని కూర్చున్నారు. మీకిదేమన్నా న్యాయం-ధర్మంగా ఉందా? ఏ గొడవైన ఇల్లూ-వాకిలి దాటకుండా వుంటేనే ముద్దూ-ముచ్చటానూ. చెట్టా-పట్టాలు వేసుకుని తిరిగారే దేనికయినా కొద్దో-గొప్పో, పట్టూ-విడుపూ వుండాలి కదా! పాలూ-నీళ్ళులా వుండాల్సిన మీరే నిప్పూ-ఉప్పూలా చిటపటలాడ్డం క్షేమం-లాభం కూడా కాదు. ప్రతీ సమస్యకు ఎదో ఒక దారీ-తెన్నూ వుండకపోదు గదా! పెద్దా-చిన్నా లేకుండా ఎంత తోస్తే అంతేనా? బింకం-పొంకం వున్నంతకాలం ఫర్వాలేదు. మ్ముందు-ముందు  కాలో-చెయ్యో వంగాక? ఈ కోపం-తాపం ఎన్నాళ్ళు. రేపో మీ మావగారు కట్నం డబ్బు ఇచ్చేస్తే ఇంక గొడవా-గొందీ ఏముందీ? అమ్మాయి మీద ఇంతో-అంతో, జాలీ-దయా చూపించూ. పోట్లాటకయినా అంతూ-పొంతూ లేదా తాడో-పేడో తేల్చుకోవాలంటే ఏళ్ళూ-ఫూళ్ళూ కావాలా? నిదానం-ప్రదానం బాబు! మీరిద్దరు కలకాలం సుఖః-సౌఖ్యాలతో వర్ధిల్లాలని మరీ-మరీ కోరుకునే మీ ఇరుగూ-పొరుగూ..పిల్లా_పాపలతో హాయిగా ఉండండి.

No comments:

Post a Comment

test

Loading...