కుచ్చుటోపి - సచిత్ర వారపత్రిక
షోకు - నాజూకు (సౌందర్య సలహాల శీర్షిక)
నిర్వహణ: రంభ మరియు ఊర్వశి (ప్రముఖ బ్యూటీషియన్లు)
1.
కుర్ర చూపుల వీరయ్య (మొర్రిపాలెం)
ప్ర. నా వయసు 81.. 18 లా కనిపించాలంటే ఏం చేయాలి?
జ. ఏం చెయక్కరలేదు. 63 ఏళ్ళు వెనక్కి వెళితే సరి.
2.
మచ్చల పిచ్చయ్య (రచ్చపాడు)
ప్ర. పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి?
జ. మనం పోవాలి.
3.
నిక్కుల నీరజ (కక్కులూరు)
ప్ర. నా వయసు 50 దాటింది. తలపై రెండు మూడు వెంట్రుకలు నెరవడం వల్ల బెంగతో నిద్రపట్టడం లేదు.ఏం
చేయమంటారు?
జ. ‘స్లీప్వెల్’ నిద్రమాత్రలు రోజొకటి జీవితాంతం వాడండి.
4.
నంకా వెంకాయమ్మ (ఢంకావారిపాలెం)
ప్ర. నా జుట్టు సగం తెల్లగాను, సగం నల్లగాను ఉంటుంది. జుట్టంతా ఒకే రంగులో ఉండాలంటే ఏం చెయ్యాలి?
జ. నల్లజుట్టుకు తెల్ల రంగుకాని, తెల్ల జుట్టుకు నల్ల రంగుకాని మీ అభిరుచి బట్టి వేసుకుంటే జుట్టంతా ఒకే రంగులో ఉంటుంది.
5.
సన్నపాటి సన్యాసమ్మ (చీకుచింతలపాడు)
ప్ర. నా బుగ్గలు పీక్కుపోయి, చప్పి దవడలు కనిపిస్తున్నాయి.బుగ్గలు బూరెల్లా కనిపించడానికి ఏం చేయాలి?
జ. రేయింబవళ్ళు ‘బబుల్గమ్’ నములుతూ ఉండాలి.
6.
గారపాటి బూరయ్య (జోరీగలపట్నం)
ప్ర. గారపట్టి అసహ్యంగా కనిపిస్తున్న నా పళ్ళూ టూత్పేస్ట్ ప్రకటనలో మోడల్ అమ్మాయి పళ్ళూ మెరిసినట్టు
తళతళా మెరవాలంటే ఏం చేయాలి.
జ. గోదావరి ఇసుకతో గంటకోసారి తోమండి.
7.
ధగధగల ధనమ్మ (నిగనిగలూరు)
ప్ర. ముసలితనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జ. పడుచువయసులోనే పరమపదించాలి.
8.
షోకేసుల లోకేషు (రాకాసిపేట)
ప్ర. చుండ్రు పోవాలంటే ఏం చేయాలి?
జ.ఒండ్రు మట్టితో తల రుద్దాలి.
9.
నిద్రలేమి భద్రమ్మ (రుద్రవరం)
ప్ర.కళ్ళచుట్టూ నల్ల వలయాలు పోవాలంటే ఏం చేయాలి?
జ.రేయింబవళ్ళూ మెలకువ లేకుండా నిద్రపోవాలి.
10.
వట్టితల చిట్టయ్య (లొట్టలూరు)
ప్ర. బట్టతలపై జుట్టు మొలిచే ఉపాయం చెప్పండి
జ. జుట్టు మొలిచేవరకు పట్టు వదలకుండా బట్టతలపై పుట్టతేనె మర్దించండి.
తొలి ప్రచురణ
పొద్దులో....