.................................................హోలీ................................................

రంగుల పండుగ హోలీ వస్తుందంటే యువతీయువకులు, వృధ్ధులు, మధ్య వయస్కులు అందరిలో కొత్త
ఉత్సాహం తొంగి చూస్తుంటుంది. ఇది వసంతఋతువు ఆగమనానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇది

శ్రీహరికి బధ్ధశత్రువైన హిరణ్యకశిపుడనే రాక్షసుడు విష్ణుభక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుని చంపమని
తన సోదరి హోలికను ఆజ్ఞ ఇస్తాడు.కాని నిప్పుల్లో పడ్డ ప్రహ్లాదుడికి హాని కలుగదు.కాని హోలిక అ
మంటలలో మాడి మసైపోతుంది.అందుకే నేటికీ హోలీ ముందురోజు హోలిక దిష్టి బొమ్మను మంటల్లో
తగులబెడతారు. దీనిని కామదహనం అని కూడా అంటారు. కామము అంటే కోరిక.అదే అన్ని దుఃఖాలకు
కారణం కాబట్టి కాముని బొమ్మ చేసి మంటల్లో దగ్ధం చేస్తారు.

హోలీ పండుగ జాతి, కులం, మతం, రంగు, వయసు, ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి
ఆనందోత్సాహలతో జరుపుకుంటారు. ప్రతియేటా ఫాల్గుణ పూర్ణిమనాడు వచ్చే ఈ పండుగను
వ్యవసాయదారులు, రైతులు ఆనందంగా జరుపుకుంటారు.
హోలీ పండుగ నాడు చల్లుకోవలసిన రంగులు స్వాభావికమైనవి. సహజ సిధ్ధమైనవి అయితే
మంచిది. కృత్రిమమైన రంగులలోని హానికారక రసాయనాల వల్ల అలర్జీ వంటి చర్మవ్యాధులు
చూపు పోవడం వంటి ప్రమాదములు ఉన్నాయి. అందుకే మనం ఇంటిలోనే సురక్షితమైన
రంగులు తయారు చేసుకోవచ్చు.
ఎరుపు: రెండుస్పూన్ల రక్తచందనం పొడిని ఐదు లీటర్ల నీటిలో కలిపి మరిగిస్తే, ఎర్రగా
చిక్కగా ఉండే ద్రవం తయారవుతుంది. దానిని ఇరవై లీటర్ల నీటిలో కలిపి పలుచన
చేసుకోవచ్చు. రక్తచందనం పొడి దొరక్కపోతే ఎండిన ఎర్ర మందారాలు, లేదా ఎర్ర
దానిమ్మ తొక్కలు దాని కాండాన్ని నీటిలో మరిగిస్తే ఎర్ర నీళ్ళు తయారవుతాయి.
ఇంట్లో కుంకుమ ఉంటుందిగా అందులో బియ్యం పిండి కలిపితే ఎరుపు రంగు
పొడి రెడీ.
ఆకుపచ్చ: గోరింటాకు పొడికి బియ్యం పిండి కలిపితే ఆకుపచ్చని రంగుపొడి తయారు.
ఈ పొడిని నీటిలో మరిగిస్తే ఆకుపచ్చ రంగు తయారవుతుంది.
గులాబి: బీట్‌రూట్ చిన్న ముక్కలు కాని తురిమి కాని నీటిలో రాత్రంతా నానబెడితే
సహజమైన గులాబిరంగు రెడీ. దీనివల్ల ఏ హాని లేకపోగా చర్మసౌందర్యం మెరుగవుతుంది.
కుంకుమ:గంధం పొడికాని, పసుపు కాని సున్నం కలిపిన నీళ్ళలో వేసి కల్పి కాసేపు
కదలకుండా ఉంచితే కుంకుమ రంగు నీళ్ళు రెడీ.
పసుపు: పసుపు కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో నానబెడితే పసుపు రంగు
నీళ్ళు రెడీ. పచ్చి పసుపు కూడా వాడుకోవచ్చు.
నీలి: బట్టలకు పెట్టే నీలిమందు నీటిలో కలిపి పలుచన చేసుకుంటే సరి.
సంబరం సరే! జాగ్రత్త అవసరమే. పండుగను సరదాగా ఆస్వాదించాలేగాని ప్రాణాల మీదకు
తెచ్చుకోవద్దు. ఏ పండుగైనా జీవితాంతం సరదాగా గుర్తు తెచ్చుకోవలసిన మధురస్మృతిగా
వుండాలే తప్ప చేదు జ్ఞాపకం కారాదు.
.............



No comments:
Post a Comment