
నేను మొదటి సారి రాసిన వ్యాసం అందరికీ నచ్చినందుకు , నన్ను అభినందించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.
నేను వెయ్యి టపాలు పూర్తి చేసి విక్షనరీ, తెవికీ పనులు చేసుకుందాము హాయిగా అనుకుని బ్రేక్ తీసుకున్నా. కాని అనుకోకుండా నల్లమోతు శ్రీధర్ గారు మన బ్లాగు గుంపులోకి రావడం,ఆయనని బ్లాగు మొదలెట్టమనడం జరిగింది. మామూలుగా నేను వికీ పని చేసుకుంటూ ఉండగా, ఒక రోజు శ్రీధర్ గారు ఏమనుకున్నారో ఏమో తను రాయాలనుకున్న బ్లాగుల గురించి వ్యాసం నన్ను రాయండి అని అడిగారు. ముందు నేను షాక్ అయ్యా. వీవెన్,త్రివిక్రం,నాగరాజుగారు, ప్రసాద్‌ని అడిగా ఇది సంగతి ఏం చేయను అని. వాళ్ళకు నామీద నాకంటే ఎక్కువ నమ్మకముంది. మీరు చేయగలరు ..మొదలెట్టండి అన్నారు. సరే. కంప్యూటర్ ఎరా పత్రిక చదివేది అందరూ కంప్యూటర్ ఉన్నవాళ్ళే, తెలుగు వచ్చినవాళ్ళే. మన బ్లాగులు, వికీ గురించి తెలియాలంటే, రాయలంటే తప్పనిసరిగా కంప్యూటర్ ఉండాల్సిందే. ఇది మంచి అవకాశం వదలకూడదు అని నిర్ణయించుకుని కొందరు బ్లాగర్లు ఇచ్చిన లింకులను సేకరించడం మొదలెట్టా.
అన్ని లింకులనుండి సమాచారాన్ని ముందుగా ప్రింట్ చేసి పెట్టుకున్నా. అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోడం కుదరదుగా. ఇంట్లో మావారికి కూడా చెప్పలేదు. ప్రింట్ చేసిన పేపర్లు చూసి మావారు అడిగారు ఏంటిది నా పేపర్లన్నీ ఖాళీ చేస్తున్నావ్,ప్రింటర్ ఇంక్ అంత తొందరగా ఐపోతుంది ఎన్ని సార్లు నింపనూ అని. ఒక ఆర్టికల్ రాస్తున్నా అని చెప్పాగాని కంప్యూటర్ ఎరా అని చెప్పలా. ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మావారు ఆ పత్రిక కొంటున్నారు. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. ఎలాగైతేనేమి అనుకున్న సమయానికి వ్యాసం రాసి శ్రీధర్ గారికి అందివ్వగలిగాను. ఆయన చిత్రాలు పెట్టి కష్టపడి కవర్ పేజీ తయారు చేసారు.
నిజంగానే ఇది ఒక యజ్ఞం లా అనుకుని చేసాను. ఎందుకంటే బ్లాగుల గురించి, వికీ గురించి ఇంత వివరంగా చెప్పే అవకాశం వచ్చినందుకు, నా శాయశక్తులా ప్రయత్నించి అన్ని వివరాలు ఇవ్వగలిగా. దీనికి వీవెన్,కిరణ్ , త్రివిక్రమ్,శిరీష్ గారు,రమణ,నవీన్ ఎంతో సాయపడ్డారు. వారి సాయం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.నేను అనుకున్నది, వీళ్ళందరికి చెప్పింది ఇది నా అర్టికల్ కాదు మనందరిది అని.
ఈ వ్యాసం రాసేటప్పుడు నేను రోజూ దేవుడిని ఇదే కోరుకున్నా. ఇది పూర్తి అయ్యేవరకు నాకు మానసికంగా కాని, శారీరకంగా కాని ఎటువంటి సమస్యలు రావద్దని, ఎలాంటి అడ్డంకులు రాకుండా పూర్తి చేయాలని. అది జరిగింది చాలు ఎంతో సంతృప్తిగా ఉంది. నేను ఇదంతా చెప్పింది నా గొప్పలు చెప్పాలని కాదు.నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నానిలా అని అంతే.
ఈ వ్యాస రచనలో నాకు అనుక్షణం సహకరించిన గురువుగారు వీవెన్ కు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సతాయించాలెండి. థాంక్యూ వీవెన్.
నా ఈ విజయాన్ని మావారికి, పిల్లలకు మా వివాహ రజతోత్సవ కానుకగా ఇచ్చా. పత్రికాఫీసునుండి కాంప్లిమెంటరు కాపీ వచ్చేవరకు మావారికి తెలీదు. పత్రిక చూసి ఏంటిది ,ఎందుకొచ్చింది అని అడిగారు. చదివాకా నవ్వుతూ గుడ్ బావుంది అన్నారు.మనసులో కాస్త గర్వంగా ఫీల్ అయ్యారు . కాని బయటపడలేదు. నాకు తెలీదేంటి.పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటున్నారు.
ముచ్చట్లు ఎక్కువయ్యాయి కాని ఇక మామూలుగా నా బ్లాగులు రాసుకుంటాను. త్వరలో ఒక చురకలాంటి టపా రాయబోతున్నా మరి.
No comments:
Post a Comment