Sunday, July 29, 2007
తేనె కన్నా తీయనిది తెలుగు...
" ఏవండి! వచ్చేనెల మా తమ్ముడి పెళ్ళి ఉంది. మీరు ఓ పదిరోజులు సెలవుపెట్టి బ్యాంకు నుండి డబ్బులు తీసుకురండి. అందరికీ బట్టలు కొనాలి.రైలు టికెట్లు కొనాలి. నాకు ఒక మంచిపట్టు చీర కావాలి. అన్నీ పాతబడ్డాయి.వింటున్నారా."
Monday, July 23, 2007
అనగనగా.......
ఆ రాజుకు నలుగురు కొడుకులు...
రామరాజు
సోమరాజు
భీమరాజు
బక్కరాజు...
వీరిలో ఒక్కొక్క రాకుమారుడికి చదువులో ఒక్కో సబ్జెక్ట్ అంటే చాలా
ఇష్టం. ఎప్పుడూ అదే సబ్జెక్ట్ చదవడానికి ఇష్టపడతారు...
ఇందులో ఇంగ్లీషులో ఆలోచించే రాజు ఎవరు?????
ఎవరు??
ఎవరు??
Sunday, July 22, 2007
అంకెలతో పద్య సంకెలలు
ఆద్యుడున్న యప్పు డందరు పూజ్యులే
లెక్క మీద సున్న లెక్కినట్లు
అతడు పోవు వెనుక నంద రపూజ్యులే
లెక్కలేక సున్న లేగినట్లు!!
అని ఓ కవి గొప్పవాడిని అనుసరించే జనులను సున్నాతో పోల్చాడు. సున్నాకి ఏదైనా అంకెతో కూడినప్పుడే తప్ప ప్రత్యేకంగా విలువ లేదు కదా !
మేమేమి తక్కువ తిన్నాం అంటూ ఇంకో కవి హనుమత్సందేశాన్ని అంకెల్లో దాచి మరీ గంభీరంగా చెప్పాడు.
అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి తృతీయం బక్కడ
నుంచి ద్వితీయంబుదాటి యొప్పుగ వచ్చెన్!!
ఈ పద్యాన్ని పంచభూతములతో అన్వయించుకొని చెప్పుకోవాలి.1.భూమి 2. నీరు 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశాలు .
చతుర్ధజాతుడు అనగా వాయుపుత్రుడైన హనుమంతుడు పంచమ మార్గమున(ఆకాశ మార్గాన ) వెళ్ళి, ప్రధమ తనూజను(భూమిపుత్రి సీత) చూసి , తృతీయంబు(అగ్ని)నక్కడ నుంచి అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు( నీరు-సముద్రం) దాటి తిరిగొచ్చాడు అని అర్ధం. ఒప్పుకుంటారా కవి సామర్ధ్యాన్ని?
గద్వాల సోమరాజుని పొగడుతూ ఓ కవి ఎంత గమ్మత్తుగా ఆకాశానికెత్తేసాడో చూద్దామా!!
నలుగురు బలికిరి సరియని
నలుగురు బలి కిరి సురూప నయ దాన ధరా
వలయ ధురా చరణోన్నతి
పొలుపుగ గద్వాల సోమ భూపాల నకున్!!
గద్వాల రాజు (సురూప) అందంలో నలుడు , (నయ) బుద్ధిలో గురుడు అంటే బృహస్పతి, దానంలో ‘బలి’ చక్రవర్తి, ధరావలయాన్ని(భూమిని) మోయటంలో (కిరి) వరహావతారంగా అని అంటే నలు-గురు- బలి-కిరి ట.
ఇలాంటి వాళ్ళని చూసి ఒళ్ళు మండిన ఆడిదం సూరకవి దేవుడితో మొర పెట్టుకున్నాడంట..
దేవునాన మున్ను దేశాన కొకరుండు
ఇప్పుడూర నూర నింట నింట
నేడ్వు రార్వు రేడ్వు రెనమండ్రు తొమ్మండ్రు
పదువు రైరి కవులు పద్మనాభ!!
ఇదివరకు దేశానికొక్క కవి ఉంటే నేడు ఇంటికి పదిమంది తయారయ్యారు భగవంతుడా!!
భావ కవిత్వాన్ని అభావ కవిత్వంగా జమ కట్టి హేళన చేస్తూ అనంత పంతుల రామలింగస్వామిగారు ఇలా అన్నారు.
రెండు కాకులు కూర్చుంటె బండ మీద
నొండెగిరిపోయె నంత నందొండు మిగిలె
రెండవది పోయె పిదప నందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!!
కాని ఇది చూస్తూ ఊరకుండని కొందరు ప్రబుద్ధులు ఈ హేళనలోనుండి కూడా వేదాంత పరమైన అర్ధాన్ని చెప్పి భావ కవిత్వానికి కూడా ఒక అర్ధం ఉంటుందని ఋజువు చేశారు . ఇందులో జీవాత్మ, పరమాత్మ అనే కాకులు బండ అనే శరీరంలో ఉన్నాయి. జీవాత్మ ఎగిరిపోయి పరమాత్మలో కలియగానే పాపం బండ లాంటి శరీరం మిగిలిపోయిందంట .
ఇక ఈ కవులు సుందర సుకుమారి స్త్రీని కూడా వదలకుండా అంకెలతో ఆటలాడారు. ఎలా అంటారా ?? ఆమె ముఖం మీదే లెక్కలేసారు మన శృంగార ప్రియులు.
అనువై నెన్నుదు రొంటు గాఁ బదునొకండై బొమల్ జంటగా
ఘనతం బోల్పగ రెండు రెండు తొమ్ముదులునై కర్ణద్వయం బొప్పగా
ఘన పూర్ణస్థితి బర్వులీల నెసగంగా నింతయుంగూడ దా
దిన సంఖ్యం దిలకింప నిండు నెలగా దీపించు మో మింతికిన్!!
ఆమె నుదురు ఒకటిలా, కనుబొమలు పదకొండులా, చెవులు రెండు తొమ్మిదుల్లా వుండి పూర్ణిమ నాటి చంద్రునిలా ముఖం ప్రకాశిస్తుందని ఆయన గారి వెర్రి సంబరం. అర్ధం కాలేదు కదా!
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
౧ | ౨ | ౩ | ౪ | ౫ | ౬ | ౭ | ౮ | ౯ | ౧౦ |
ఆమె నుదురు ౧ , కనుబొమలు ౧౧ , చెవులు ౯౯ లా ఉన్నాయి .
1+11+9+9 = 30 అయి పూర్ణిమ నాటి చంద్రునిలా ఉందని కవి చమత్కారం .
పెళ్ళికాని యువకులకు కవి కస్తూరి రంగనాధుడు ఎటువంటి కన్యను చూసి వివాహం చేసుకోవాలో చెప్తున్నారు.
కన్యకునైదు జంఘలును కన్యకు నేడు విశాల నేత్రముల్
కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నారు కుచద్వయంబులున్
కన్యకు ద్వాదశంబరయగా వర మధ్యము గల్గినట్టి యా
కన్యకు నీకునుం బదియు గావలె కస్తూరి రంగ నాయకా!!
ఈ పద్యం ఖగోళశాస్త్ర పరిజ్ఞానంతో అర్ధం చేసుకోవాలి. ఖగోళంలో ౧౨ రాశులున్నాయి . ౧. మేషం ౨. వృషభం ౩. మిథునం ౪ . కర్కాటకం ౫. సింహం ౬. కన్య ౭. తుల ౮. వృశ్చికం ౯. ధనుస్సు ౧౦. మకరం ౧౧. కుంభం ౧౨ మీనం. ఇప్పుడు ‘కన్య’ రాశి నుండి మొదలుపెడితే ఐదో రాశి మకరం (మొసలి వంటి పిక్కలు), ఏడో రాశి మీనం ( చేపల్లాంటి కళ్ళు), నాలుగో రాశి ధనుస్సు( విల్లు వంటి కనుబొమలు), ఆరో రాశి కుంభం ( కుంభాల వంటి కుచాలు), పన్నెండో రాశి సింహం(నడుము), పదో రాశి మిథునం (జంట). ఈ లక్షణాలు కలిగిన కన్య నీకు జంట కావాలని కోరిన కవి ఇలా ‘రాశి’ పోశాడు.
మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తిరుపతి వేంకట కవులు తమ ‘శ్రవణానందం’ కావ్యంలో ఒక స్త్రీకి ఎంత విలువ కట్టారో చూడండి.
పలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!
సంఖ్యాగత శ్లోకాలు కొన్ని చూద్దాం!
లాల యేత్ పంచవర్షాణి - దశ వర్షాణి తాడయేత్
ప్రాప్తేత్తు షోడశే వర్షే - పుత్రం మిత్రవ దాచరేత్!!
కొడుకుని ఐదేళ్ళవరకు బుజ్జగించాలి. పదేళ్ళ వరకు కొట్టి బుద్ధి చెప్పాలి . పదహారో ఏటి నుండి స్నేహితునిలా చూడాలని పై శ్లోకం చెప్తుంది. ఎందుకంటే పుట్టినవాడు శూరుడో, పండితుడో , మహా వక్తో,దాతో కావాలి గాని పరమ శుంఠ కాకూడదు కదా! కాని అది కూడా దుర్లభమంటుంది ఈ శ్లోకం …..
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః
వక్తా దశ సహస్రేషు దాతా భవతి వా నవాః
అంటే వందమందిలో ఒక పండితుడు, పదివేల మందిలో ఒక మహావక్త పుడతారేమో గాని దాత అనేవాడుంటాడో లేదో అని సందేహ పడుతున్నా అటువంటి కోవకు చెంది వుండాలంటే మనిషికి కొన్ని నియమాలు ఉండాలి .అవి ఏవంటే….
శత విహాయ భోక్తవ్యం - సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం - కోటిం త్యక్త్యా హరిం భజేత్!!
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి. వేయి పనులు విడిచి స్నానం చేయాలి . లక్ష పనులు విడిచి దానం చేయాలి. కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి…
తొలి ప్రచురణ పొద్దులో...
Wednesday, July 18, 2007
రండి రండి దయచేయండి....

రండి రండి రండి దయచేయండి
తమరి రాక అందరికీ సంతోషం సుమండీ
బ్లాగులు రాసేవారికి, రాయనివారికి, చదివేవారికీ అందరికీ ఇదే ఆహ్వానం.
ఏంటండి సినిమా పాట పాడుతున్నా అనుకుంటున్నారా? బ్లాగులోకొచ్చాక కూడా ఇంకా రండి అంటున్నానంటారా.. నేను రమ్మని అన్నది తెలుగు వికీపీడీయాలోకి. అందరూ టపటపా బోలేడు టపాలు రాసేస్తున్నారు. సంతోషం. అదే చేత్తో తెవికీలోకి కూడా అడుగెట్టి అక్కడ కూడా రాయండి.ఏం రాయాలి అంటారా? పదిమందికి ఉపయోగపడుతుంది అనే విషయం ఏదైనా రాయొచ్చు.వికీలో రాసింది అందరికీ ఉచితంగా మరియు స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలి.
అందుకని కాపీహక్కులున్న సమాచారాన్ని వికీలో చేర్చకూడదు
సినిమా
వంటలు
కూరగాయలు,పండ్లు
చందస్సు
సామెతలు
జాతీయాలు
పురాణగాధలు
జానపద కళలు
మీ ఊరి గురించి
ఇలా కాదేది కవితకనర్హం అన్నట్టు తెవికీలో పనికొచ్చేది రాయొచ్చు. కాని రాయడానికి పుస్తకాలు కొనాలేమో అనుకోకండి. మీ దగ్గర ఉంటే సరి లేదా మీ పిల్లల స్కూలు పుస్తకాలు తీసుకుని చదివి మీకు అర్ధమైంది ఇంకాస్త వివరంగా రాసేయండి. తెలుగు చందస్సు,ఉపవాచకములోని కథలు, వేరే ఏ విషయమైనా తెలుగులో రాసేయండి. బ్లాగు రాయడానికే సమయం సరిపోవడం లేదు ఇక వికీలో ఎలా రాసేది అంటారా.వారానికి ఓ గంట తెవికీ కి కేటాయించండి. లేదా రోజు కొంచం కొంచం రాయండి మీ తీరిక సమయంలో. మీ కుటుంబ సభ్యులకు చెప్పండి , పిలలకు కూడా వాళ్ళ క్లాసు పుస్తకాల నుండి ఎదో విషయం కాని, లేదా పుస్తకం కొనిచ్చి రాయమనండి. కాస్త అలవాటైతే వదలరు. అలా వాళ్ళు తెలుగు మరిచిపోకుండా ఉంటుంది. సేకరణల బ్లాగుల వాళ్ళు తమ బ్లాగులలో ఉన్న విషయాలు పదిమందికి పనికొస్తాయి అని అనుకుంటే వికిసోర్సులో రాయండి. కీర్తనలు లాంటివి.తెవికీలో రాయడం చాలా సులువు. దానికి ఎటువంటి సాధనాలు కానీ, మృదులాంత్రాలు కాని అవసరం లేదు. మీరు మామూలుగా చిన్న చిన్న మార్పులతో ఇంగ్లీషులో టైప్ చేసుంటే అక్కడ తెలుగులో వచ్చేస్తుంది. చాలా ఈజీ.మీకు ఏ సందేహమైనా సహాయమైనా ఇవ్వడానికి వికీ సభ్యులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. .
http://groups.google.com/group/teluguwiki?hl=te
మరి తొందరగా వచ్చేయండి.

Tuesday, July 3, 2007
శతశతమానం భవతి...

అందరికీ సహస్ర వందనాలు. ఈరోజు నేను నా బ్లాగులన్నింటిలో కలిపి వెయ్యి టపాలు పూర్తి చేసాను. నేను బ్లాగు రాయడం మొదలెట్టి తొమిది నెలలైంది. గుంపులో కొచ్చి ఏడాది అయ్యింది. ఈ పయనం మీ అందరి సహకారంతో
చాలా సునాయాసంగా నడిచింది. ఇప్పటివరకు ఈ బ్లాగు సందర్శకులు - 15,000 .....
జ్యోతి 200
షడ్రుచులు 300
అన్నపూర్ణ 200
గీతలహరి 275
నైమిశారణ్యం 25
నేను బ్లాగులు రాసేది నాకోసం. ఎవరినీ ఉద్దరించడానికి కాదు. నాకు తెలుసు ఈ బ్లాగులో నేను పనికొచ్చేది ఏమీ రాయనని. ఎప్పుడు సరదా కబుర్లే ఉంటాయి. ఏం చేయను సీరియస్ విషయాలు రాయాలని ఎంతో ప్రయత్నించాను. అసలవి నా బుర్రకెక్కితే కదా బ్లాగులో రాసేది. ప్రసాద్ అంతరంగం చూసి ఎన్నో సార్లు అనుకుంటాను. నేను అంత లోతుగాఎందుకు ఆలోచించను అని. ఇంకో విషయం చెప్పాలి. రాధిక నా బ్లాగులన్ని చదివి వ్యాఖ్యలు రాస్తుంది. కాని నేను తన కవితలను గురించి వ్యాఖ్యలు రాయను. తన కవితలను బాగుంది అని చెప్పడం బాగుండదు. చాలా బాగుంటాయి కాని నా భావాలను సరిగా వ్యక్తపరచలేను అందుకే ఏమీ రాయను తన బ్లాగులో. మిగతా బ్లాగుల్లో కూడా నాకు అర్ధం కానివి చాలా ఉన్నాయి. వాటిలో వ్యాఖ్యలు ఎమని రాయను మరి.
నేను ఎన్నో విషయాలలో సాంకేతికమైన సందేహాలు అడిగి వీవెన్,సుధాకర్ ని తెగ సతాయించాను. పాపం వాళ్ళు ఓపికగా చెప్పేవారు.. ఊరికే సతాయించినందుకు సారీ…అడిగినవన్నీ చెప్పినందుకు థాంక్స్…సాహిత్య సంబంధమైన విషయాలలో కొత్తపాళిగారు కూడా ఎంతో సహాయం చేసారు. ఇలా అందరికీ నా కృతజ్ఞ్తతలు.
ఒక విషయం…. ఇక నేను రాయడం తగ్గించి, లేదా తాత్కాలికంగా ఆపేసి చదవడం మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. విశాలాంధ్రపై దాడి చేయాలి.
రవి, వీవెన్, నవీన్ నేను తెవికి కి వస్తున్నాను. కాసింత చోటు ఇవ్వండి.
నా మొదటి టపా ఇది .. ధమాకాతో మొదలెట్టా…….స్పీకర్లు ఆన్ చేయండి.
ఇప్పుడొక SHORT BREAK...