
వేసవి సెలవులు అంటే తిరుపతి వెంకన్నకి కూడా పండగలాగే ఉంది. గత నెలరోజులుగా ఏప్రిల్ 24 నుండి మే 23 వరకు తిరుపతిని దర్శించివారు సుమారు 22 లక్షలమంది, క్రితం సారి 15.3 లక్షలంట.ఒక్కోరోజు సుమారు 80 వేలమంది కూడా వస్తున్నారు. దర్శనానికి 75 గంటలు(మూడు రోజులు) కూడా పడుతుంది. ఇది ఇలాగే ఇంకో పదిహేను రోజులుంటుందంట. ఇక హుండీ లెక్కలు చూస్తే ఒక్క నెలలోనే సుమారు 25 కోట్లు. టిటిడి సంవత్సర ఆదాయం 900 కోట్లు.గత నెలలో సుమారు 10.5 లక్షలమంది గుండ్లు కొట్టించుకున్నారంట. ఇంకో విడ్డూరం చూడండి మే 20 ఆదివారం రోజు 41,000 వేలమంది 15-18 గంటలు లైన్లలో నిలబడి మరీ గుండు కొట్టించుకున్నారంట.
మరి వెంకన్నకి ఇన్ని కోట్ల ఆదాయం ఇస్తున్న భక్తులకి ప్రభుత్వం కాని అక్కడి అధికారులు గానీ ఇస్తున్న సౌకర్యాలేంటి. లెక్కలలో కనపడకుండా బొక్కింది ఎంతో మరి. బడా దొంగలను వదిలి చిన్న చిన్న దొంగలను పట్టుకున్నామంటూ ప్రకటిస్తున్నారు. వసతి కోసం గంటలు గంటలు నిలబడాలి. దొరక్కపోతే ఆరుబయటే మకాం.మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది. భక్తులు పెరుగుతున్నప్పుడు వారి వసతులు పెంచాల్సిన అవసరం లేదా.ఇక ఇంత కష్టపడి వేలు ఖర్చు పెట్టుకుని ఎంతో దూరాన్నుండి వచ్చిన భక్తులకు స్వామివారిని చూసేందుకు నిమిషం కూడ సమయం ఇవ్వరు. మహాలఘు దర్శనం అని దేవుడిని కూడా దూరం చేసారు.తిరుపతి వెళ్ళాలంటే డబ్బుల కట్టలు జేబులో ఉంటే చాలన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. మనీ మనీ మనీ.
భక్తులు ఎక్కువైతే పాపం దేవుడికి విశ్రాంతి కూడా కరవే. రెండు గంటలకు పవళింపు సేవ చేసి మూడు గంటలకు సుప్రభాతం పాడేస్తున్నారు.ఇలాంటప్పుడు అక్కడికి వెళ్ళి డండం పెడితే కాని దేవుడు ఒప్పుకోడా మనది భక్తి కాదా.మన ఇంటి దగ్గరున్న వేంకటేశ్వరుడు దేవుడు కాదా. ఇక్కడ దండం పెట్టి మొక్కులు తీర్చుకుంటే అది తప్పా? తిరుపతిలో హుండీలో డబ్బుల కట్టలేసే ధర్మాత్ములు తమ ఇంటి పనిమనిషి పిల్లలకు కనీసం పుస్తకాలైనా కొనిస్తారా? ఆరోగ్య సమస్యలుండి డబ్బులు లేక చావు బ్రతుకులలో ఉన్న ఎంతో మంది ప్రకటనలు పేపర్లలో చూసి స్పందిస్తారా. సాయం చేస్తారా? అస్సలు చేయరు ఆ దేవుడు నాకు ఎవరెక్కువ డబ్బులెక్కువ ఇస్తే ఎక్కువ వరాలిస్తా అన్నాడా? లేదే.తమ పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి చేసే యత్నమే కదా.
స్వామీ తిరుపతి వేంకటేశ్వరా ! ఎందుకయ్యా అంత అప్పు చేసి మరీ పెళ్ళి చేసుకున్నావ్. ఇప్పుడు చూడు ఎంత కష్టపడుతున్నావో. హాయిగా మహారాజైన మావగారినే ఖర్చుపెట్టుకోమంటే పోయేది కదా. ఎలాగూ కట్నం తీసుకోలేదు..లేదా సింపుల్‌గా చేస్కుంటే పోయేది. ఖర్మ. పాపం నువ్వు కూడా ఏం చేసావ్. కలియుగం కదా.